Ad Code

ప్రతీ రాత్రి వినియోగదారుల డేటాను వాట్సాప్ ఎగుమతి చేస్తుంది !


వాట్సాప్ కంపెనీ ప్రతీ రాత్రి వినియోగదారుల డేటాను ఎగుమతి చేస్తుంటుందని ఎలాన్ మస్క్ ఆరోపించారు. కొంతమంది ఇప్పటికి కూడా వాట్సాప్ చాలా సేఫ్ అనే అపోహలోనే ఉన్నారని ఆయన అన్నారు. అయితే ఎలాన్ మస్క్ ఈ వ్యాఖ్యను ఊరికే చేయలేదు. ''వాట్సాప్ రోజూ రాత్రి వినియోగదారుల ఛాటింగ్ డేటాను ఎగుమతి చేస్తుంటుంది. ఆ సమాచారాన్ని అడ్వర్టయిజ్ మెంట్, మార్కెటింగ్ అవసరాల కోసం తరలిస్తుంది. ఆ సమాచారం ఆధారంగా వినియోగదారుల్లో ఎవరెవరి అభిరుచి ఏమిటి ? ఎవరెవరికి ఏయే అంశాలపై ఆసక్తి ఉంది ? ఎవరెవరికి ఎలాంటి ప్రకటనలను చూపించవచ్చు ? అనే దానిపై ఒక అంచనాకు వస్తుంది'' అంటూ ఓ వినియోగదారుడు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు. దీనికి రిప్లై ఇచ్చే క్రమంలోనే ఎలాన్ మస్క్ పై వ్యాఖ్యలు చేశారు. సదరు ఎక్స్ యూజర్ కామెంట్‌తో మస్క్ ఏకీభవించారు. ఈ ఆరోపణపై వాట్సాప్ పేరెంట్ కంపెనీ మెటా ఇంకా స్పందించలేదు. ఎలాన్ మస్క్ వ్యాఖ్యలపై కంప్యూటర్ ప్రోగ్రామర్, వీడియో గేమ్ డెవలపర్ జాన్ కార్మాక్ స్పందిస్తూ ''వినియోగదారుల వాట్సాప్ ఛాట్‌లను స్కాన్ చేశారని చెప్పేందుకు.. ఇతరులకు ఎగుమతి చేశారని చెప్పేందుకు ఏమైనా ఆధారాలు ఉన్నాయా ?'' అని ప్రశ్నించారు. ''యూజర్ల వినియోగ తీరు తెన్నుల ప్రాథమిక సమాచారాన్ని మాత్రమే వాట్సాప్ కంపెనీ సేకరిస్తోందని నేను భావిస్తున్నాను. చాటింగ్ క్రమంలో కొందరు యూజర్లు బాట్‌లను వాడితే సమాచారం బదిలీ అయ్యే రిస్క్ ఉంటుంది. అంతే తప్ప డీఫాల్ట్‌గా వాట్సాప్ మెసేజ్‌లు ఎగుమతి అవుతున్నాయంటే నేను నమ్మను'' అని జాన్ కార్మాక్ వెల్లడించారు. ఈమేరకు ఆయన ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేశారు. ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్ గతంలోనూ పలుమార్లు మార్క్ జుకర్‌బర్గ్ నడుపుతున్న మెటా ప్లాట్‌ఫామ్‌పై ఈ విధమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రఖ్యాత మెసేజింగ్ ప్లాట్ ఫామ్‌లు ఎక్స్, వాట్సాప్ మధ్య ముందు నుంచి భారీ పోటీ నెలకొంది. ఫీచర్ల విషయంలోనూ ఈ రెండు సోషల్ మీడియా వేదికలు వైవిధ్యంగా ముందుకు సాగుతున్నాయి. గతంలో కేజ్ ఫైట్ చేద్దామంటూ ఎలాన్ మస్క్, మార్క్ జుకర్ బర్గ్‌లు సవాళ్లు, ప్రతి సవాళ్లను సంధించుకున్న సంగతి తెలిసిందే.

Post a Comment

0 Comments

Close Menu