Ad Code

ఢిల్లీలో 24 గంటల్లో 228 మిల్లీమీటర్ల కురిసిన వాన !


డతెరిపి లేకుండా కురిసిన వాన ఢిల్లీని నీట ముంచింది. ఢిల్లీఎయిర్‌పోర్ట్‌ టెర్మినల్‌-1 వద్ద పైకప్పు కూలిన ఘటనలో ఒకరు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలుకాగా, టెర్మినల్‌-1 వద్ద కార్యకలాపాల్ని అధికారులు నిలిపివేశారు. వేసవి తాపంతో అల్లలాడిపోతున్న దేశరాజధానిని వరుసగా రెండో రోజు వరుణుడు పలకరించాడు. అయితే వర్షం నాన్‌స్టాప్‌గా కురవడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఉదయాన్నే ట్రాఫిక్‌జామ్‌తో జనాలు అవస్తలు పడ్డారు. గత 24 గంటల్లో 228 మిల్లీమిటర్ల వర్షపాతం నమోదు కాగా, కేవలం అర్ధరాత్రి 2.30గం. నుంచి 5.30గం. మధ్యలోనే 150 మిల్లీమీటర్ల​ వర్షం నమోదైంది. ఢిల్లీ జూన్‌ వర్షాల్లో ఇది కొత్త రికార్డు అని అధికారులు అంటున్నారు. శుక్రవారం వేకువజామున ఈదురు గాలుల వాన ధాటికి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ టెర్మినల్‌-1 వద్ద పైకప్పు కూలిపోయింది. ఘటనలో కొన్ని వాహనాలు ధ్వంసం అయ్యాయి. పలువురు అందులో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక చర్యలు మొదలయ్యాయి. ఫైర్‌ సిబ్బంది క్షతగాత్రుల్ని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ఘటనలో ఒకరు మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. ఆరుగురికి గాయాలయ్యాయని, అందులో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు.


Post a Comment

0 Comments

Close Menu