Ad Code

కొండెక్కిన నిత్యావసర సరుకుల ధరలు !


కేంద్రం, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటైన ఈ కొద్ది రోజుల్లోనే నిత్యావసర సరుకుల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. కూరగాయలూ అదే రీతిన సాగుతున్నాయి. ఉల్లిపాయలు, టమోటా, ఆకు కూరలు, ఇతర కూరగాయాలను కొనుగోలు చేయడానికి గతంలో కంటే రెట్టింపు మొత్తాన్ని ఖర్చు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. అమూల్, మదర్ డైరీ వంటి సంస్థలు పాల రేట్లను సైతం పెంచిన విషయం తెలిసిందే. నిత్యావసర, ఆహారేతర వస్తువుల ధరలు సైతం ఆకాశానికి ఎగబాకడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రోజూ వినియోగించే సబ్బులు, డిటర్జెంట్లు, బాడీ వాష్, టూత్ పేస్ట్, షాంపూ, కాఫీ, టీ, నూడుల్స్, ఓట్స్, హెయిర్ ఆయిల్, కాస్మటిక్స్.. వంటి వస్తువుల ధరలు అమాంతం పెరిగాయి. ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, ఐటీసీ, గోద్రెజ్, ఇమామి, విప్రో, డాబర్ ఇండియా, హిందుస్తాన్  యూనిలీవర్, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్.. వంటి ఎఫ్ఎంసీజీ కంపెనీలు తమ ఉత్పత్తులను 2 నుంచి 17 శాతం వరకు పెంచాయి. తమ ఉత్పత్తులను తయారు చేయడానికి అవసరమైన ముడి వస్తువుల, పదార్థాల ధరలు పెరగడం వల్ల ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని వివరించాయి. గోద్రెజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్‌కు చెందిన సబ్బులపై ధరలు 4 నుంచి 5 శాతం పెరిగాయి. హిందుస్తాన్ యూనిలీవర్ తన డోవ్ సబ్బుల ధరలను రెండు, విప్రో ప్రొడక్ట్ సంతూర్ సబ్బుల ధరను మూడు శాతం వరకు పెంచింది. కోల్గేట్ పామోలివ్ బాడీ వాష్ ధర 2 నుంచి 3, పియర్స్ బాడీ వాష్ నాలుగు శాతం మేర పెరిగింది. హిందుస్తాన్ యూనిలీవర్, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ హైజీన్ అండ్ హెల్త్ కేర్, జ్యోతి ల్యాబ్స్‌కు చెందిన డిటర్జెంట్ బ్రాండ్‌లు ఎంపిక చేసిన ప్యాక్‌లపై 1 నుంచి 10 శాతం వరకు ధరలను పెంచాయి. హిందుస్థాన్ యూనిలీవర్ అన్ని రకాల షాంపూలు, చర్మ సంరక్షణ ఉత్పత్తులను 4 శాతం వరకు పెంచింది. నెస్లే కాఫీ ధరలను 8 నుంచి 13, మ్యాగీ ఓట్స్ నూడుల్స్ 17 శాతం పెరిగాయి.

Post a Comment

0 Comments

Close Menu