Ad Code

అమిత్ షాతో సంభాషణపై తమిళిసై వివరణ


ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం సందర్భంగా ఏర్పాటు చేసిన స్టేజీపై తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసైకు హోంమంత్రి అమిత్ షా వార్నింగ్ ఇచ్చిన వీడియో తెగ వైరల్ అయింది. స్టేజీపైకి వచ్చిన తమిళిపై అందరికీ నమస్కారం చేసుకుంటూ వెంకయ్యనాయుడు ప్రక్కన కూర్చున్న అమిత్ షాకి నమస్కరించి ముందుకు వెళ్తుండగా వెనక్కి పిలిచి.. సీరియస్‌గా మాట్లాడడం కనిపించింది. ఆయనేదో మాట్లాడుతుండగా తమిళిసై వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా పట్టించుకోలేదు. వారు మాట్లాడుతుండగా వెంకయ్యనాయుడు అలా చూస్తూనే ఉండిపోయారు. అనంతరం ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. తమిళిసైకు అమిత్ షా వార్నింగ్ అంటూ ప్రచారం జరిగింది. అంతేకాదు.. తమిళనాడులోని డీఎంకే పార్టీ కూడా ఖండించింది. ఒక పబ్లిక్ మీటింగ్‌లో ఒక మహిళ పట్ల ఇలా వ్యవహరించడం పద్ధతి కాదని తప్పుపట్టింది. ఈ ఘటన పొలిటికల్‌ టర్న్ తీసుకోవడంతో తాజాగా తమిళిసై వివరణ ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలిసారి ఏపీలో హోంమంత్రి అమిత్ షాను కలిసినట్లు తెలిపారు. ఎన్నికల తర్వాత ఫాలోఅప్, ఎదుర్కొన్న సవాళ్లు గురించి అడిగి తెలుసుకోవడానికి పిలిచారని చెప్పారు. తాను వివరిస్తున్నానని.. సమయం తక్కువగా ఉన్నందున.. రాజకీయ, నియోజకవర్గ పనులు చూసుకోవాలని సలహా ఇచ్చారని చెప్పుకోచ్చారు. కానీ ఏదో జరిగినట్లుగా ఊహాగానాలు సృష్టించారని ఆమె చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే ఎన్నికల ఫలితాలు తర్వాత తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై-తమిళిసై వర్గాల మధ్య విమర్శలు.. ప్రతి విమర్శలు చోటుచేసుకున్నాయి. మీడియాకు ఎక్కి రచ్చ రచ్చ చేసుకున్నారు. ఈ సందర్భంగా తమిళిసైకి క్లాస్ పీకినట్లుగా వార్తలు వినిపించాయి.

Post a Comment

0 Comments

Close Menu