Ad Code

ఇక్సిగో ఐపీఓకు అనూహ్య స్పందన ?


క్సిగో పేరిట ఆన్‌లైన్‌ ట్రావెల్‌ బుకింగ్‌ వేదికను నిర్వహిస్తున్న లీ ట్రావెన్యూస్‌ టెక్నాలజీ లిమిటెడ్‌ ఐపీఓకు అనూహ్య స్పందన లభించింది. జూన్‌ 10న ప్రారంభమైన సబ్‌స్క్రిప్షన్‌ బుధవారంతో ముగిసింది. చివరిరోజు పూర్తయ్యేసరికి మొత్తం 98.10 రెట్ల సబ్‌స్క్రిప్షన్‌ లభించింది. ఐపీఓలో భాగంగా 4,37,69,494 (4.37 కోట్లు) షేర్లను ఇక్సిగో అందుబాటులో ఉంచగా.. 429,36,34,618 (429 కోట్ల) బిడ్లు దాఖలయ్యాయి. ధరల శ్రేణిని కంపెనీ రూ.88-93గా నిర్ణయించింది. గరిష్ఠ ధర వద్ద రూ.740 కోట్లు సమీకరించేందుకు ఐపీఓకు వచ్చిన తొలి రోజే 1.95 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయ్యింది. సబ్‌స్క్రిప్షన్‌ గడువు ముగిసేసరికి నాన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు 110.25 రెట్లు, క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయ్యర్ల విభాగం 106.73 రెట్లు, రిటైల్‌ ఇన్వెస్టర్ల పోర్షన్‌ 53.95 రెట్ల సబ్‌స్క్రిప్షన్‌ అందుకుంది. గురుగ్రామ్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఇక్సిగో తాజా ఐపీఓలో రూ.120 కోట్లు విలువ చేసే కొత్త షేర్లను విక్రయిస్తోంది. వీటి రూపంలో సమీకరించిన నిధుల నుంచి రూ.45 కోట్లు నిర్వహణ మూలధన అవసరాల కోసం కేటాయించనుంది. డేటా సైన్స్‌, క్లౌడ్‌, కృత్రిమ మేధ వంటి అత్యాధునిక సాంకేతికతలను సమకూర్చుకోవడానికి రూ.26 కోట్లు వాడుకోనుంది. మరికొన్ని నిధులను కొనుగోళ్లు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు ఉపయోగించుకోనుంది. లీ ట్రావెన్యూస్‌ టెక్నాలజీని ఆలోక్‌ బాజ్‌పాయ్‌, రజినీశ్‌కుమార్‌ 2007లో ఏర్పాటుచేశారు. దేశంలో ప్రముఖ ఆన్‌లైన్‌ ట్రావెల్‌ అగ్రిగేటర్‌గా కొనసాగుతోంది. రైలు, బస్సు, విమాన టికెట్లు సహా హోటల్‌ బుకింగ్‌లకు ఇక్సిగో ప్రధాన వేదికగా ఉంది. కంపెనీ ఆదాయం 2023 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.517 కోట్లుగా నమోదైంది. లాభం రూ.23.4 కోట్లుగా నివేదించింది. యాక్సిస్‌ క్యాపిటల్‌, డీఏఎం క్యాపిటల్‌ అడ్వైజర్స్‌, జేఎం ఫైనాన్షియల్‌ ఈ ఐపీఓకి లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu