Ad Code

దేశంలో కొవిడ్‌ కాలంలో 11.9 లక్షల అధిక మరణాలు ?


భారత్‌లో కొవిడ్‌-19 మహమ్మారి విజృంభణ సాగిన 2020లో 11.9 లక్షల మంది అధికంగా చనిపోయినట్లు ఒక అంతర్జాతీయ అధ్యయనం పేర్కొంది. 2019తో పోలిస్తే ఇది 17 శాతం ఎక్కువని తెలిపింది. భారత్‌ అధికారికంగా వెల్లడించిన కొవిడ్‌ మరణాల కన్నా ఇది 8 రెట్లు ఎక్కువని, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూహెచ్‌వో) వేసిన అంచనాల కన్నా 1.5 రెట్లు అధికమని పేర్కొంది. ఈ అధ్యయనాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ తీవ్రంగా తప్పుబట్టింది. ఆక్స్‌ఫర్డ్‌ సహా పలు విశ్వవిద్యాలయాలకు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. వీరు భారత్‌లోని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌)-5 నుంచి 7.65 లక్షల మందికి సంబంధించిన డేటాను సేకరించి, విశ్లేషించారు. దీని ఆధారంగా 2019 నుంచి 2020 మధ్యలో దేశంలో స్త్రీ-పురుష, సామాజిక బృందాలవారీగా సగటు ఆయుర్దాయంలో వచ్చిన మార్పులను అంచనావేశారు. ఈ అధ్యయనాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ఖండించింది. ''ఆ అంచనాలు తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయి. లోపభూయిష్టమైన పద్ధతిలో వారు చేసిన అధ్యయనం ఆమోదయోగ్యం కాదు. ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌లో సర్వేలో ప్రస్తావించిన డేటాలో నుంచి కొన్ని కుటుంబాలకు సంబంధించిన మరణాల రేటును మొత్తం దేశానికి వర్తింపజేయలేం. దేశంలోని సివిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టమ్‌ (సీఆర్‌ఎస్‌) అత్యంత విశ్వసనీయమైనది. దీని ప్రకారం 2019తో పోలిస్తే 2020లో మరణాలు 4.74లక్షలు పెరిగాయి. అయితే, అధికంగా నమోదైన మరణాలన్నింటికీ కొవిడ్‌ మహమ్మారి కారణమని చెప్పలేం. ఇతరత్రా ఆరోగ్య సమస్యలూ ఉంటాయి'' అని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. 

Post a Comment

0 Comments

Close Menu