Ad Code

ఆసియా కప్‌-2024 ఫైనల్‌లోకి భారత్‌ మహిళల జట్టు !


హిళల ఆసియా కప్ 2024లో భారత జట్టు ఫైనల్‌కు దూసుకువెళ్లింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఈ టోర్నీలో అడుగుపెట్టిన భారత్ దుంబుల్లా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని 11 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఛేదించింది. భారత బ్యాటర్లలో స్మృతి మంధాన (55 నాటౌట్‌; 39 బంతుల్లో 9 ఫోర్లు, 1సిక్స్‌) హాఫ్ సెంచరీ బాదగా.. షెఫాలీ వర్మ (26 నాటౌట్‌; 28 బంతుల్లో 2 ఫోర్లు) రాణించింది. స్వల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మలు తొలి బంతి నుంచే దూకుడుగా ఆడారు. బంగ్లాదేశ్ బౌలర్లపై ఎదురుదాటికి దిగారు. ముఖ్యంగా స్మృతి మంధాన తనదైన శైలిలో ఆఫ్‌సైడ్ చూడ చక్కని షాట్లతో అలరించింది. మరోవైపు షఫాలీ సైతం ధాటిగానే ఆడడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. వీరిద్దరి ధాటికి పవర్ ప్లేలో భారత్ వికెట్ నష్టపోకుండా 46 పరుగులు చేసింది. అనంతరం మంధాన మరింత జోరు పెంచింది. కేవలం 38 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించింది. అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 80 పరుగులు మాత్రమే చేసింది. బంగ్లా బ్యాటర్లలో కెప్టెన్ నిగర్ సుల్తానా (32), షోర్నా అక్టర్ (19 నాటౌట్‌)లు మాత్రమే రెండు అంకెల స్కోరు చేశారు. మిగిలిన వారు సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. భారత బౌలర్లలో రేణుకా సింగ్‌, రాధా యాదవ్‌లు చెరో మూడు వికెట్లు తీశారు. పూజా వస్త్రాకర్‌, దీప్తి శర్మలు చెరో వికెట్ పడగొట్టారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. ముఖ్యంగా పేసర్ రేణుకా సింగ్ ఆదిలోనే బంగ్లాను కోలుకోలేని దెబ్బ తీసింది. తన వరుస ఓవర్లలో వికెట్లు పడగొట్టింది. తొలి ఓవర్‌లో దిలారా అక్టర్ (6) ను ఔట్ చేసిన రేణుకా.. తన రెండో ఓవర్‌లో ఇష్మా తంజిమ్ (8), మూడో ఓవర్‌లో ముర్షిదా ఖాతున్ (4) లను ఔట్ చేసింది. దీంతో 21 పరుగులకే బంగ్లాదేశ్ మూడు వికెట్లు కోల్పోయింది. అనంతరం భారత బౌలర్లు దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్‌, దీప్తి శర్మలు రాణించడంతో బంగ్లాదేశ్ 44 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ నిగర్ సుల్తానా, షోర్నా అక్తర్‌లు కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. అయితే.. భారీ షాట్లు కొట్టడంలో విపలం అయ్యారు. నిగర్ సుల్తానాను రాధా యాదవ్ ఔట్ చేయడంతో 36 పరుగుల ఏడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తరువాత కూడా బంగ్లా బ్యాటర్లు తమ బ్యాట్లను ఝుళిపించకపోవడంతో భారత్ ముందు స్వల్ప లక్ష్యం నిలిచింది.

Post a Comment

0 Comments

Close Menu