Ad Code

250 మంది ఉద్యోగులకు ఉద్వాసన చెప్పిన అన్‌అకాడమీ !


దేశంలోని పాపులర్‌ ఎడ్‌టెక్‌ కంపెనీల్లో ఒకటైన అన్‌అకాడమీ భారీగా ఉద్యోగులను తొలగించింది. ఈ కంపెనీ తన కార్యకలాపాలు, వ్యాపార సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి రీస్ట్రక్చరింగ్‌లో భాగంగా 250 మంది ఉద్యోగులపై వేటు వేసింది. 2023 మార్చిలో కూడా అన్‌అకాడమీ లేఆఫ్స్ ఇచ్చింది. ఖర్చులను ఆదా చేసేందుకు ఏకంగా 10 శాతం ఉద్యోగులను తొలగించింది. ఈ సంవత్సరం మేలో గ్రూప్ కంపెనీ ప్రిప్‌లాడర్ కూడా 145 మంది ఉద్యోగులపై వేటు వేసింది. తాజా లేఆఫ్స్ గురించి అన్‌అకాడమీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో గౌరవ్ ముంజాల్ ఒక ట్వీట్ చేశారు. తాము అన్‌అకాడమీని లాంగ్‌ టర్మ్‌ కోసం ప్రిపేర్‌ చేస్తున్నామని చెప్పారు. గ్రోత్‌, ప్రాఫిటబిలిటీ పరంగా సంస్థకు ఇది బెస్ట్‌ ఇయర్‌ అవుతుందని పేర్కొన్నారు. కంపెనీకి అనేక సంవత్సరాల ఆర్థిక స్థిరత్వం ఉందని స్పష్టం చేశారు. 'మా కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా చేయడానికి, సంవత్సరానికి మా లక్ష్యాలను సాధించడానికి ఇటీవల కంపెనీని పునర్నిర్మించాం. స్థిరమైన వృద్ధి, లాభదాయకతపై పెడుతున్న ఫోకస్‌కి ఈ మార్పు అవసరం. దురదృష్టవశాత్తూ, కొంతమంది ఉద్యోగులను తొలగించాం. ప్రభావితమైన వ్యక్తులందరికీ మేము సపోర్ట్‌ ఇస్తాం.' అని వీటిపై కంపెనీ ప్రతినిధి ఒక ప్రకటనలో చెప్పారు. అన్‌అకాడమీ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ హేమేష్ సింగ్ కంపెనీ నుంచి నిష్క్రమించిన కొన్ని వారాల తర్వాత ఈ లేఆఫ్స్‌ చోటు చేసుకున్నాయి. బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న అన్‌అకాడమీ, ఆన్‌లైన్ ఎడ్యుకేషనల్‌ ప్లాట్‌ఫామ్‌ అందిస్తుంది. వివిధ పోటీ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేస్తుంది. అలాగే ఫౌండేషన్, స్కిల్ బిల్డింగ్ కోర్సులపై కంటెంట్‌ను అందిస్తుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో, అన్‌అకాడమీ ఆపరేటింగ్‌ రెవిన్యూ 26% పెరిగి రూ.907 కోట్లకు చేరుకుంది. దాని నష్టాలు కూడా దాదాపు 40 శాతం తగ్గి రూ.1,004 కోట్లకు చేరుకున్నాయి. అయితే 2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆడిట్‌ యాన్యువల్‌ రిపోర్టును కంపెనీ ఇంకా ఫైల్ చేయలేదు. ఈ రిపోర్ట్‌ అందుబాటులోకి వస్తే సంస్థ లేఆఫ్స్‌కి గల కారణాలు, లాభాలు, పురోగతిపై పూర్తి అవగాహన వస్తుంది. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా చాలా కంపెనీలు ఇప్పటికీ ఉద్యోగులకు లేఆఫ్స్ ఇస్తున్నాయి. Layoffs.fyi వెబ్‌సైట్ ప్రకారం, ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా మొత్తం 347 టెక్‌ కంపెనీలు లేఆఫ్స్‌ ప్రకటించాయి. ఏకంగా 99,737 మంది ఉద్యోగాలు కోల్పోయారు.

Post a Comment

0 Comments

Close Menu