Ad Code

మొబైల్‌ ఫోన్లపై కస్టమ్స్‌ సుంకం తగ్గింపు !


కేంద్ర బడ్జెట్‌ లో మొబైల్‌ ఫోన్‌లు, మొబైల్‌ ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డ్‌ అసెంబ్లీలు, మొబైల్‌ ఛార్జర్‌లపై ప్రాథమిక కస్టమ్స్‌ డ్యూటిని 20 నుంచి 15 శాతానికి తగ్గించాలని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రతిపాదించారు. ఫలితంగా రిటైల్‌ మార్కెట్‌లో వీటి ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. కేంద్ర మంత్రి చేసిన ప్రకటన భారత మొబైల్ ఫోన్ తయారీ వ్యవస్థను మరింత బలోపేతం చేయనుంది. ప్రస్తుతం ఎక్కువగా ఉన్న సుంకాల తగ్గింపుతో తయారీ వ్యవస్థ పుంజుకొనే అవకాశం ఉంది. దేశీయ తయారీని ప్రోత్సహించడంలో భాగంగా ఈ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా భారత్‌లో మొబైల్‌ తయారీ పరిశ్రమ గణనీయంగా వృద్ధి చెందుతోంది. తాజాగా బేసిక్ కస్టమ్స్‌ డ్యూటీ తగ్గింపు ప్రతిపాదన భారత్‌లో తయారీ సామర్థ్యాలను మరింత ప్రోత్సహిస్తుంది. ఇప్పటికే కేంద్రం వీటికోసం ప్రత్యేక పథకాలను అందుబాటులోకి తెచ్చింది. స్పెషల్‌ ఇన్సెంటివ్‌ ప్యాకేజీ స్కీమ్‌, ఎలక్ట్రానిక్‌ కాంపోనెంట్స్ మరియు సెమీ కండక్టర్‌ల తయారీ ప్రోత్సాహం సహా PLI పథకాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. మొబైల్‌ ఫోన్ల బేసిక్‌ కస్టమ్స్‌ ట్యాక్స్‌ తగ్గింపు ప్రతిపాదన సహా టెలికాం విడిభాగాలకు సంబంధించి ప్రత్యేక ప్రతిపాదనలు చేశారు. నిర్దిష్ట టెలికాం విడిభాగాలపై బేసిక్‌ కస్టమ్స్‌ ట్యాక్స్‌ను 10-15 శాతానికి పెంచే ప్రతిపాదనలు చేశారు. ఈ తాజా ప్రతిపాదనతో దిగుమతులకు బదులుగా దేశీయంగా ఉత్పత్తి చేసేందుకు అవకాశం ఉండనుంది. పరిశ్రమ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, దేశీయ తయారీ వ్యవస్థను ప్రోత్సహించడంలో భాగంగానే కెపాసిటర్‌లు, రెసిస్టెర్‌లు సహా నిర్దిష్ట టెలికాం పరికరాల విడిభాగాలపై ప్రాథమిక కస్టమ్స్‌ సుంకాన్ని పెంచే ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి మొబైల్‌ తయారీ రంగంపై తీసుకొచ్చిన ప్రతిపాదన గణనీయ అభివృద్ధిని సూచిస్తుంది. దేశీయ ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుతుంది. ఈ ప్రతిపాదనలపై పరిశ్రమ వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి. సరళీకృత ఇన్‌పుట్‌ డ్యూటీ వ్యవస్థలను కలిగి ఉన్న చైనా మరియు వియత్నం వంటి తయారీ వ్యవస్థలతో పోటీపడేందుకు ఈ తాజా ప్రతిపాదనలు సహకరిస్తాయమని అభిప్రాయం వ్యక్తం చేశారు. వచ్చే ఆరు నెలల్లో వీటిని అమలు చేస్తామని ఆర్థిక మంత్రి చెప్పినట్లు తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu