Ad Code

ఎన్నికలకు ముందు బదిలీ ఆర్డర్లు తీసుకున్న టీచర్ల బదిలీల రద్దు !


ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ముందు బదిలీ ఆర్డర్లు తీసుకున్న టీచర్ల బదిలీలను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. టీచర్ల బదిలీల ప్రక్రియలో అక్రమాలు చోటుచేసుకున్నాయి అన్న ఫిర్యాదులు రావడంతో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి విజయ్ రామరాజు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో 2024 ఫిబ్రవరి నుండి 2024 జూన్ వరకు రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల బదిలీలను రద్దు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు హడావుడిగా సిఫార్సులతో ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు జరిగాయని గత కొంత కాలంగా ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. గత ప్రభుత్వం అక్రమ బదిలీలకు పాల్పడిందని దాదాపు 917 మంది ఉపాధ్యాయులు, మంత్రులు అధికారుల సిఫార్సులతో తమకు నచ్చిన ప్రాంతాలకు బదిలీ చేయించుకున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వెలువయ్యాయి. కొన్ని ఉపాధ్యాయ సంఘాలు ఈ మేరకు ఆందోళనలు కూడా చేశాయి. అక్రమ బదిలీలను వెంటనే ఆపాలని డిమాండ్ చేశాయి. అయితే ఎన్నికల ముందు హడావిడిగా బదిలీలు చేస్తున్నట్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వీరిని ఆయా స్థానాల నుంచి రిలీవ్ చేసి బదిలీ అయిన స్థానాలకు పంపలేదు. అయితే ఏపీలో వైసిపి ఓటమి చెంది ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ అక్రమ బదిలీల పైన దృష్టి సారించారు. టీచర్ల అక్రమ బదిలీలను రద్దు చేస్తామని ప్రకటించిన క్రమంలో తాజాగా ఈ మేరకు సీఎం చంద్రబాబు ఆదేశాలతో బదిలీలను నిలిపివేస్తూ సంచలన ఉత్తర్వులు వెలువరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని ఆర్జెడి, డీఈవో లకు సూచిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ్ రామరాజు ఉత్తర్వులలో వెల్లడించారు. 2024 ఫిబ్రవరి నుంచి జూన్ వరకు జరిగిన అన్ని బదిలీలను రద్దు చేస్తున్నట్టు ఈ ఉత్తర్వులలో పేర్కొన్నారు.

Post a Comment

0 Comments

Close Menu