Ad Code

భిల్ ప్రదేశ్ కోసం గిరిజనలు ఉద్యమం !


రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్‌లోని 49 జిల్లాలతో కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయాలని రాజస్థాన్ గిరిజన సమాజం డిమాండ్ చేస్తుంది. ఇందులో మెజార్టీ జిల్లాలను రాజస్థాన్ నుంచి అడుగుతోంది. రాజస్థాన్‌లో 33 జిల్లాలు ఉండగా 12 జిల్లాలను ఇవ్వాలని స్పష్టం చేసింది. కొత్త రాష్ట్రం కోసం ఆదివాసి పరివార్ సహా 35 గిరిజన సంఘాలు ఉద్యమ బాట పట్టాయి. గురువారం బన్సార్వాలో గల మంగఢ్ ధామ్ వద్ద మెగా ర్యాలీ చేపట్టాయి. ర్యాలీలో ఆదివాసి పరివార్ వ్యవస్థాపక సభ్యులు మేనకా దామోర్ ప్రసంగించారు. 'ఇకపై గిరిజన మహిళలు పండితుల సలహాలు, సూచనలు పాటించకూడదు. నుదుటిపై సింధూరం పెట్టుకోవద్దు. మంగళసూత్రం ధరించొద్దు. గిరిజన మహిళలు, యువత విద్యపై దృష్టి సారించాలి. అలాగే ఉపవాసాలు కూడా మానేయాలి. మనం హిందువలమే కాదు అని' మేనకా దామోర్ పిలుపునిచ్చారు. ఆదివాసి పరివార్ సంస్థ రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ఉనికిలో ఉంది. 'భిల్ ప్రదేశ్ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనేది కొత్తది కాదు. చాలారోజుల నుంచి డిమాండ్ చేస్తున్నాం. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను భారత్ ఆదివాసి పార్టీ కోరుతుంది. మెగా ర్యాలీ తర్వాత ఆదివాసి ప్రతినిధులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీని కలిసే అవకాశం ఉంది అని' భారత్ ఆదివాస్ పార్టీ ఎంపీ రాజ్ కుమార్ రోత్ స్పష్టం చేశారు. ఆదివాసిల మెగా ర్యాలీకి రాజస్థాన్ నుంచే కాకుండా మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర నుంచి భారీగా గిరిజనులు తరలివచ్చారు. గిరిజనుల ర్యాలీ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. గిరిజనుల డిమాండ్‌ను గిరిజన శాఖ మంత్రి బాబులాల్ ఖారది తప్పు పట్టారు. 'కులం పేరుతో ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయలేం. ఒకవేళ గిరిజనుల కోసం రాష్ట్రం ఇస్తే మరొకరు తమకు కావాలని డిమాండ్ చేస్తారు. అందుకే గిరిజనుల రాష్ట్రం కోసం కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రతిపాదన పంపడం లేదు. గిరిజనులు తమ మతాన్ని మార్చుకుంటే, వారికి గిరిజన రిజర్వేషన్ వర్తించదు అని' మంత్రి బాబులాల్ హెచ్చరించారు.

Post a Comment

0 Comments

Close Menu