Ad Code

గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో మంత్రుల బృందం పర్యటన !


గోదావరి వరద కారణంగా ఇబ్బందులు పడుతున్న నిర్వాసితులను పరామర్శించాలన్న ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రుల బృందం శనివారం పోలవరం విలీన మండలాల్లో పర్యటించింది. వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి, హోం మంత్రి వంగలపూడి అనితతో కూడిన మంత్రుల బృందం కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో పర్యటించింది. కుక్కునూరు మండలం దాచారం పునరావాస కాలనీని సందర్శించిన మంత్రులు.. అక్కడ నిర్వాసితులకు అందుతున్న ప్రభుత్వ సహాయాన్ని పరిశీలించారు. సహాయ కార్యక్రమాలపై బాధితులు, అధికారులను ముఖాముఖి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పునరావాస కాలనీల్లో ఉన్న సమస్యలను బాధితులు మంత్రుల దృష్టికి తెచ్చారు. అనంతరం అక్కడి నుంచి వేలేరుపాడు మండలం కన్నాయిగుట్ట చేరుకున్న మంత్రులు గోదావరి వరద ప్రవాహాన్ని పరిశీలించారు. వరద ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ప్రస్తుతం పునరావాస కాలనీల్లో తలదాచుకుంటున్న వరద బాధితులకు ప్రభుత్వం తరపున నిత్యావసరాలు అందిస్తున్నామని, వరద తగ్గిన తర్వాత ఒక్కో కుటుంబానికి రూ.3 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu