Ad Code

విశ్వాస పరీక్షలో నెగ్గిన నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలి !


నేపాల్‌ కొత్త ప్రధానిగా నియమితులైన కేపీ శర్మ ఓలి విశ్వాస పరీక్షలో నెగ్గారు. పార్లమెంటులో నిర్వహించిన బలపరీక్షలో ఆయన సునాయాసంగా గట్టెక్కారు. నేపాల్‌ పార్లమెంటు ప్రతినిధుల సభలో మొత్తం 263మంది సభ్యులు ఉండగా కేపీ శర్మ ఓలి ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానానికి అనుకూలంగా 188 ఓట్లు.. వ్యతిరేకంగా 74 ఓట్లు వచ్చాయి. ఒక సభ్యుడు గైర్హాజరయ్యారు. నేపాలీ కాంగ్రెస్‌, సీపీఎన్‌ -యూఎంఎల్‌, లోక్‌తంత్రిక్‌ సమాజ్‌వాదీ పార్టీ, జనతా సమాజ్‌వాదీ పార్టీ నేపాల్‌ ప్రతినిధులు కేపీ ఓలి శర్మకు అనుకూలంగా ఓటు వేయగా.. సీపీఎన్‌- మావోయిస్టు సెంటర్‌, సీపీఎన్‌ -యూనిఫైడ్‌ సోషలిస్ట్‌, రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ, రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ సభ్యులు వ్యతిరేకంగా ఓటేశారు. పుష్ప కమల్‌ దహల్‌ అలియాస్‌ ప్రచండ(69) నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఇటీవల కుప్పకూలిన విషయం తెలిసిందే. పార్లమెంటులోని ప్రతినిధుల సభలో గత శుక్రవారం నిర్వహించిన విశ్వాస పరీక్షలో ప్రచండ ఓడిపోయారు. ఈ క్రమంలోనే కె.పి.శర్మ ఓలి (72) సారథ్యంలో సీపీఎన్‌-యూఎంఎల్‌, మరో మాజీ ప్రధాని షేర్‌ బహదూర్‌ దేవ్‌బా సారథ్యంలోని నేపాలీ కాంగ్రెస్‌(ఎన్‌సీ) కూటమిగా ఏర్పడి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో తన బలాన్ని నిరూపించుకొనేందుకు ఆదివారం కేపీ శర్మ ఓలి విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. దీంట్లో నెగ్గేందుకు వాస్తవానికి 138 ఓట్లు అవసరం కాగా.. ఆయనకు అంతకుమించి ఓట్లు వచ్చాయి. దీంతో ప్రతినిధుల సభలో ప్రవేశ పెట్టిన విశ్వాస పరీక్షలో కేపీ శర్మ ఓలి విజయం సాధించినట్లు స్పీకర్‌ దేవ్‌ రాజ్‌ ఘిమిరే ప్రకటించారు.

Post a Comment

0 Comments

Close Menu