Ad Code

అసాధ్యమైన హామీలతో ప్రత్యర్థులు అందలం ఎక్కారు !


వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వైయస్ఆర్‌ జయంతి కార్యక్రమం నిర్వహించారు. వైయస్ఆర్ విగ్రహానికి పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్నికల్లో పార్టీ ఓటమి పైన కీలక వ్యాఖ్యలు చేసారు. వైయస్ఆర్ ఆశయ సాధన కోసం వైయస్‌ జగన్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ప్రజల తీర్పును గౌరవిస్తున్నాని చెబుతూనే ఆసక్తి కర విశ్లేషణ చేసారు. ప్రజల పక్షాన పోరాటానికి వైయస్ఆర్‌సీపీ ఎప్పుడూ సిద్ధంగా ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. తాము ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశామని చెప్పారు. అసాధ్యమైన హామీలతో ప్రత్యర్థులు అందలం ఎక్కారన్నారు. హామీలు ఇచ్చి మోసం చేయటం, ప్రజలను భ్రమల్లో ఉంచటం వైయస్‌ జగన్‌కి చేతకాదని చెప్పారు. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలతో పని లేకుండా వైయస్‌ జగన్ పరిపాలన చేశారని వివరించారు. విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చారన్నారు. ఇళ్ల ముంగిటకే వైయస్ జగన్ పరిపాలన తెచ్చారని పేర్కొన్నారు. అందరం కలిసి ముందుకు సాగుదామని సూచించారు.  చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే నిలదీద్దామని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి, ప్రజలకు ఏ ఇబ్బంది కలిగినా వైయస్ఆర్ సీపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ప్రజల పక్షాన ఎప్పుడూ పోరాటానికి సిద్ధంగా ఉంటుందని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.హామీలన్నీ ఇప్పటికిప్పుడు అమలు చేయడం సాధ్యం కాదన్నట్టుగా చంద్రబాబు మాట్లాడుతున్నారని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని అంటున్నారని ఎద్దేవా చేసారు. ఆర్నెళ్ల క్రితం చంద్రబాబుకి రాష్ట్ర పరిస్థితి అంచనా లేదా అని ప్రశ్నించారు. అలవికాని హామీలివ్వడం ఎందుకు ? ఇప్పుడు అమలు చేయలేమని చేతులెత్తేయడం ఎందుకన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీల్లో కనీసం 10 శాతం ఇచ్చినా కూడా వైసీపీకి ఈ పరిస్థితి వచ్చేది కాదని కొందరు అంటున్నారని, కానీ జగన్ పద్ధతి అది కాదన్నారు. అలవికాని హామీలిచ్చి ప్రజల్ని మోసం చేయడం జగన్ కి ఇష్టం లేదన్నారు. పదే పదే అలా మోసం చేయడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారని సజ్జల వివరించారు.

Post a Comment

0 Comments

Close Menu