Ad Code

తిరుమల సేవల్లో ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్‌ ?


శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు కల్పిస్తోన్న దర్శనం, వసతి, తదితర సేవల్లో దళారుల ప్రమేయం లేకుండా చేయాలని, మరింత పారదర్శకంగా అందించడానికి టీటీడీ చర్యలు తీసుకుంది. ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్‌ ద్వారా నిజమైన భక్తులను గుర్తించేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోంది. ఏడాది కాలంగా ఆన్‌లైన్‌లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం, డిప్, వసతి గదుల కేటాయింపు, ఆర్జిత సేవలు, వర్చువల్ టికెట్ల జారీ, ఆఫ్‌లైన్‌లో మంజూరు చేసే సర్వదర్శనం టోకెన్లు, వసతి గదుల బుకింగ్‌పై ఇటీవల టీటీడీ విచారణ జరిపింది. ఈ సందర్భంగా కొన్ని దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒకే మొబైల్ నంబర్, మెయిల్ ఐడీలు ఉపయోగించి దళారులు బల్క్‌గా బుకింగ్ పొందినట్లు విచారణలో తేలింది. ఈ ఏడాది తిరుమలలో కరెంట్ బుకింగ్‌లో ఒకే మొబైల్ నంబర్‌తో 110 గదులు, 124 బుకింగ్స్ సంబంధించి 12కు పైగా గదులు పొందినట్లు అధికారులు నిర్ధారించారు. ఆన్‌లైన్ బుకింగ్‌లో ఒకే మొబైల్ నంబర్‌ను ఉపయోగించి 807, ఒకే ఇమెయిల్ ఐడిని ఉపయోగించి 926 వసతి గదులను దళారులు బుక్ చేసుకున్నట్లు గుర్తించారు. ఒకే మొబైల్ నంబర్‌ ద్వారా ఒక ఏడాదిలో 1,279, ఒకే మెయిల్ ఐడిపై 48 డిప్ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ధృవీకరించారు. ఒకే ఐడి ప్రూఫ్‌ను ఉపయోగించి 14 సర్వదర్శనం టోకెన్లను సైతం పొందినట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో మధ్యవర్తులను నిర్మూలించడానికి అధికారులు చర్యలు తీసుకున్నారు. బల్క్ బుకింగ్‌లకు ఉపయోగించే మొబైల్ నంబర్లు, మెయిల్‌, ఐడి ప్రూఫ్‌లను రద్దు చేశారు. ఫేక్ మొబైల్ నెంబర్లు, మెయిల్ ఐడిలు, ఐడి ప్రూఫ్ లు ఉపయోగించి ఇప్పటికే బుక్ చేసిన సేవలను ఉపయోగించడానికి అనుమతించబోమని తెలిపారు. బుకింగ్ రద్దు అయినట్లు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు తెలియజేస్తారు. నిజమైన భక్తులను గుర్తించడానికి ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్‌ను ఉపయోగించాలని నిర్ణయించారు. దళారులు ఫేక్ మొబైల్, మెయిల్, ఐడి ప్రూఫ్‌లను ఉపయోగించి చేసిన బుకింగ్‌లపై కఠినమైన ఆంక్షలు విధించారు. సరైన ధృవీకరణ కోసం ఆధార్ సేవలను ఉపయోగించేలా కూడా టీటీడీ ప్రయత్నాలు చేపడుతోంది.

Post a Comment

0 Comments

Close Menu