Ad Code

దేశంలో భారీగా పెరిగిన బ్రాడ్‌బ్యాండ్ యూజర్లు !


దేశంలో మొబైల్ కనెక్షన్లు, ఇంటర్నెట్, బ్రాడ్ బ్యాండ్ వినియోగం నిరంతరం పెరుగుతోంది. గత 10 సంవత్సరాలలో దేశంలో మొత్తం టెలిఫోన్, మొబైల్ కనెక్షన్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. కేంద్ర సమాచార ప్రసారాలు, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్ర శేఖర్ ఈ మేరకు పార్లమెంట్ లో వివరణ ఇచ్చారు. గత దశాబ్ద కాలంలో మొత్తం టెలిఫోన్, మొబైల్ కనెక్షన్ల సంఖ్య ఎంత వరకు పెరిగాయని లోక్ సభ సభ్యులు కృష్ణ ప్రసాద్ తెన్నేటి, వై.ఎస్. అవినాష్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అలాగే ఈ కాలంలో ఇంటర్నెట్, బ్రాడ్బ్యాండ్ యాక్సెస్ ఎంత వరకు పెరిగింది? ఈ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) ఎంత పెరిగాయని కూడా అడిగారు. దీనిపై రాష్ట్ర సమాచార ప్రసారాలు, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెమ్మసాని చంద్ర శేఖర్ స్పందిస్తూ 2014 మార్చి 31వ తేదీ నాటికి వరకు 93.3 కోట్ల టెలిఫోన్ కనెక్షన్లు ఉండగా, 2024 మార్చి 31వ తేదీ నాటికి వాటి సంఖ్య 119.87 కోట్లకు పెరిగిందన్నారు. ఈ కాలంలో మొత్తం వృద్ధి రేటు 28.48 శాతంగా ఉంది. ఈ డేటా 2014 నుంచి 2024 వరకు టెలికాం సర్వీస్ పనితీరు సూచికలపై ట్రాయ్ త్రైమాసిక నివేదిక నుంచి తీసుకున్నారు. అదే సమయంలో 2014 మార్చి 31వ తేదీ వరకు దేశంలో మొబైల్ కనెక్షన్ల సంఖ్య 90.45 కోట్లుగా ఉంది. ఇది 2024 మార్చి 31వ తేదీ నాటికి 116.59 కోట్లకు పెరిగింది. ఈ కాలంలో వృద్ధి రేటు 28.90 శాతంగా ఉంది. ప్రభుత్వం తెలుపుతున్న దాని ప్రకారం 2014 మార్చి 31వ తేదీ నాటికి ఇంటర్నెట్ సబ్స్క్రిప్షన్ 25.16 కోట్లుగా ఉంది. ఇది 2024 మార్చి 31వ తేదీ నాటికి ఏకంగా 95.44 కోట్లకు పెరిగింది. ఈ విభాగంలో వృద్ధి రేటు 279.33 శాతంగా ఉంది. బ్రాడ్ బ్యాండ్ సబ్ స్క్రిప్షన్ 2014 మార్చి 31వ తేదీ నాటికి 6.09 కోట్లుగా ఉంది. ఇది 2024 మార్చి 31వ తేదీ నాటికి 92.41 కోట్లకు పెరిగింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అత్యధికంగా స్వీకరించే వాటిలో టెలికాం రంగం కూడా ఒకటి.

Post a Comment

0 Comments

Close Menu