Ad Code

ఇంటికే ఆల్కహాల్​ డెలివరీ చేయనున్న స్విగ్గీ, జొమాటో ?


స్విగ్గీ, బిగ్​బాస్కెట్, జొమాటోలు త్వరలో బీర్, వైన్, లిక్కర్స్ వంటి తక్కువ ఆల్కహాల్ డ్రింక్స్​ని డెలివరీ చేయడం ప్రారంభించనున్నాయి. ఢిల్లీ, కర్ణాటక, హరియాణా, పంజాబ్, తమిళనాడు, గోవా, కేరళతో సహా అనేక రాష్ట్రాలు ఇందుకోసం పైలట్ ప్రాజెక్టులను పరిశీలిస్తున్నాయి. మద్యం డెలివరీలను అనుమతించడం వల్ల కలిగే లాభనష్టాలను అధికారులు ప్రస్తుతం అంచనా వేస్తున్నారని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. 2020లో స్విగ్గీ, జొమాటోలు కోవిడ్-19 లాక్​డౌన్​ సమయంలో తమ సేవలను విస్తృతం చేయడానికి నాన్ మెట్రో ప్రాంతాల్లో ఆన్​లైన్​ ఆల్కహాల్ డెలివరీని ప్రారంభించాయి. ఝార్ఖండ్ ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు పొందిన తర్వాత స్విగ్గీ తన మద్యం డెలివరీ సేవను రాంచీలో ప్రారంభించింది. జొమాటో కూడా ఈ సేవలను తొలుత రాంచీలో ప్రారంభించింది. మరో ఏడు నగరాలకు విస్తరించాలని యోచిస్తోంది. అనుమతులకు కొన్ని వారాల నుంచి నెల రోజుల సమయం పడుతుందని తెలిసినా, ఆ సమయంలో, రెండు కంపెనీలు తమ సేవలను విస్తరించడానికి ప్రధాన మెట్రో నగరాల్లోని అధికారులతో చర్చలు జరుపుతున్నాయి. ఒడిశాలోని నగరాలకు మద్యం డెలివరీ సేవలను విస్తరించాలని స్విగ్గీ భావించినప్పటికీ అంఫన్ తుఫాను కారణంగా నిలిపివేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో మాత్రమే ఇళ్లకు మద్యం డెలివరీకి అనుమతి ఉంది. మహారాష్ట్ర, ఝార్ఖండ్, ఛత్తీస్​గఢ్​, అసోంలో కోవిడ్-19 లాక్డౌన్ సమయంలో ఆంక్షలు ఉన్నప్పటికీ మద్యం డెలివరీలకు తాత్కాలిక అనుమతి విజయవంతమైందని ఈటీ నివేదిక తెలిపింది. ఆన్​లైన్​ డెలివరీల వల్ల పశ్చిమబెంగాల్, ఒడిశాలో అమ్మకాలు 20-30 శాతం పెరిగాయని రిటైల్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్​లు చెబుతున్నారు. 

Post a Comment

0 Comments

Close Menu