Ad Code

పాఠశాల స్లాబ్ కూలి విద్యార్థి మృతి !


ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ పాఠశాల స్లాబ్‌ కూలిన ఘటనలో ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.. నెల్లూరు రూరల్ పరిధి బీవీ నగర్‌లోని కురుగొండ నాగిరెడ్డి నగరపాలక సంస్థ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది.. పాఠశాలలో ఇటీవల అదనపు తరగతుల కోసం భవనాలను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో నిర్మాణం సాగుతున్న ప్రాంతం వద్ద విద్యార్థులు ఆడుకుంటుండగా… ఒక్కసారిగా స్లాబ్ కింద పడిందని.. దీంతో 9వ తరగతి చదువుతున్న గురు మహేంద్ర అనే విద్యార్థి మృతి చెందినట్టు చెబుతున్నారు. ఈ సమాచారం తెలియడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. విద్యార్థులు ఆడుకునే క్రమంలో గోడ ఎక్కుతుండగా స్లాబ్ కూలిందని అంటున్నారు. నాడు – నేడు కింద చేపట్టిన పనుల్లో నాణ్యత లేకపోవడం వల్లే ఇలా జరిగిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.. విద్యార్థి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.  ఘటన సమాచారం తెలియడంతో జిల్లా విద్యాశాఖ అధికారి రామారావును విచారణ కోసం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ పంపించారు. ఆయన పాఠశాల వద్దకు చేరుకొని ఘటనపై ఆరా తీశారు. అన్ని కోణాల్లో విచారణ జరుపుతామని ఆయన తెలిపారు. మరోవైపు పోలీస్ అధికారులు కూడా ఈ ప్రమాదంపై విచారణ చేపట్టారు. ప్రమాద విషయం తెలియగానే టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, జనసేన నాయకుడు గునుకుల కిషోర్.. అక్కడికి చేరుకున్నారు. ప్రభుత్వపరంగా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. మృతి చెందిన విద్యార్థి కుటుంబ సభ్యులకు ఐదు లక్షల రూపాయల మేర ఎక్స్ గ్రేషియను మంత్రి నారాయణ ప్రకటించారు. భవన నిర్మాణంలో నాణ్యతపై కూడా విచారణ చేయిస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. 

Post a Comment

0 Comments

Close Menu