Ad Code

హిండెన్‌బర్గ్‌పై 'సెబీ' ఆరోపణలు !


గౌతం అదానీ సారధ్యంలోని అదానీ గ్రూపు అవకతవకలకు పాల్పడుతున్నదని 2023 ప్రారంభంలో ఆరోపించిన యూఎస్ షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్ బర్గ్ మీద దేశీయ స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ 'సెబీ' సంచలన వ్యాఖ్యలు చేసింది. అదానీ గ్రూపు అవకతవకలపై నివేదిక రూపొందించిన హిండెన్ బర్గ్ ఆ నివేదికను ముందే తన క్లయింట్లతో షేర్ చేసుకున్నదని, సెబీ ఆరోపించింది. గతేడాది నివేదిక వెల్లడయ్యాక ఆయా క్లయింట్ల షార్ట్ పొజిషన్ల ద్వారా సంపాదించిన లాభాల్లో హిండెన్ బర్గ్ వాటా పొందిందని తెలిపింది. 2022 చివర్లోనే హిండెన్ బర్గ్ సంస్థ యాజమాన్యానికి కింగ్డన్ అనే యూఎస్ హెడ్జ్ ఫండ్ మేనేజర్‌తో అనుబంధం మొదలైందని సెబీ ఆరోపణ. అదానీ గ్రూప్ అవకతవకలపై హిండెన్ బర్గ్ తన నివేదికను బహిర్గతం చేయడానికి రెండు నెలల ముందే కింగ్డన్‌తో షేర్ చేసుకుందని 'సెబీ' తెలిపింది. దీనిపై సమాధానం ఇవ్వాలని కోరుతూ హిండెన్ బర్గ్ యాజమాన్యానికి తన 46 పేజీల షోకాజ్ నోటీసు ఇచ్చింది. హిండెన్ బర్గ్ నివేదికను ఆధారంగా చేసుకుని అదానీ గ్రూప్ కంపెనీల్లో కింగ్డన్ షార్ట్ పోజిషన్లు తీసుకున్నదని తెలిపింది. నివేదిక బహిర్గతం కాగానే అదానీ గ్రూప్ సంస్థల్లో తన పొజిషన్లను.. అంటే తాను కొనుగోలు చేసిన వాటాలను విక్రయించడం ద్వారా కింగ్డన్ లాభాలు గడించిందని, ఈ లాభంలో 30 శాతం హిండెన్ బర్గ్‌కు చెల్లించేందుకు రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదిరిందని వివరించింది. కానీ, హిండెన్‌బర్గ్‌కు లాభాలను బదిలీ చేయడంలో జాప్యం వల్ల తర్వాత 25 శాతానికి కింగ్డన్ తగ్గించిందని సెబీ ఆరోపించింది. సదరు కింగ్డన్ హెడ్జ్ ఫండ్ సంస్థకు, కొటక్ మహీంద్రా బ్యాంకుకు మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగాయి. హిండెన్ బర్గ్ ఆరోపణల నేపథ్యంలో అదానీ గ్రూప్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ 150 బిలియన్ డాలర్ల మేరకు హరించుకుపోయింది. అదానీ గ్రూప్ మీద ఆరోపణలు అనుచితం అని సెబీ తెలిపింది. ఒక సంస్థతో కుమ్మక్కై అనుచిత లాభాలు పొందడం సరి కాదని, నాన్ పబ్లిక్, తప్పుడు సమాచారన్ని ప్రజల్లోకి, ఇన్వెస్టర్లలోకి తీసుకెళ్లి ఆందోళనకు గురిచేసిందని సెబీ ఆరోపించింది.

Post a Comment

0 Comments

Close Menu