Ad Code

బీఎస్ఎన్ఎల్ 5జీ నెట్‌వర్క్‌తో వీడియో కాల్‌ చేసిన కేంద్ర మంత్రి సింధియా !


బీఎస్ఎన్ఎల్ తక్కువ ధరకే సర్వీసులు అందుబాటులో ఉండడం సహా త్వరలో 4G నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తారనే వార్తలతో అనేక మంది బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గుచూపుతున్నారు. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా బీఎస్ఎన్ఎల్కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు బడ్జెట్‌లో భారీగా కేటాయింపులు చేసింది. ఇప్పటికే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో బీఎస్ఎన్ఎల్ 4జీ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేశారు. ఇందుకు ప్రముఖ టెక్‌ దిగ్గజం టాటాతో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా 4G సేవలు సహా కొన్ని నెలల్లోనే 5G నెట్‌వర్క్‌కు కూడా సులభంగా అప్‌గ్రేడ్‌ అయ్యేందుకు అవకాశం ఉందని తెలుస్తోంది. తాజాగా ఆ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా టెస్టింగ్‌లో ఉన్న బీఎస్ఎన్ఎల్ 5జీ నెట్‌వర్క్‌ను పరీక్షించారు. సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ టెలిమాటిక్స్  కార్యాలయం నుంచి బీఎస్ఎన్ఎల్ 5జీ  ద్వారా వీడియో కాల్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను మంత్రి ఎక్స్ ద్వారా షేర్‌ చేశారు. ఈ వీడియోలో మంత్రి ఓ మహిళతో మాట్లాడారు. తాను కనిపిస్తున్నానా, నా మాటలు వినిపిస్తున్నాయా అని ప్రశ్నించడాన్ని వీడియోలో గమనించవచ్చు. ఈ ప్రశ్నలకు సదరు మహిళ కూడా సమాధానం చెప్పారు. మాటలు స్పష్టంగా ఉన్నాయని చెప్పడం వీడియోలో గమనించవచ్చు. అనంతరం మంత్రి పక్కన ఉన్న అధికారి బీఎస్ఎన్ఎల్ 5జీ  అంటూ మాట్లాడడం వినిపించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. 4G సర్వీసులను రోజువారీ పర్యవేక్షణకు ప్రత్యేక యూనిట్‌ ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జోతిరాదిత్య సింధియా ఇటీవల తెలిపారు. 4G నెట్‌ వర్క్ ప్రారంభం అనంతరం రోజువారీ లక్ష్యాలను నిత్యం పర్యవేక్షిస్తామని స్పష్టం చేశారు.

Post a Comment

0 Comments

Close Menu