Ad Code

ఫైనల్ కి చేరిన నీరజ్ చోప్రా !


పారిస్ ఒలింపిక్స్ 2024లో నీరజ్ చోప్రా అసాధారణ ప్రదర్శనతో ఫైనల్ చేరాడు. మంగళవారం జరిగిన జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ గ్రూప్-బీలో నీరజ్ చోప్రా ఈటెను 89.34 మీటర్ల దూరం విసిరి తుది పోరుకు అర్హత సాధించాడు. ఈ నెల 8న రాత్రి 11.55 గంటలకు జరిగే ఫైనల్ ఈవెంట్‌లో నీరజ్ చోప్రా పాల్గొంటాడు. మరో భారత ప్లేయర్ కిశోర్ జెనా మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. ఈటెను 80.73 మీటర్లను మాత్రమే విసిరి 12వ స్థానానికి పరిమితమయ్యాడు. క్వాలిఫికేషన్ గ్రూప్-ఏలో కిశోర్ జెనా పోటీ పడ్డాడు. 10 నిమిషాలు మాత్రమే మైదానంలో గడిపిన నీరజ్ చోప్రా తొలి ప్రయత్నంలోనే ఈటెను 89.34 మీటర్ల దూరం విసిరాడు. ఇది అతనికి ఈ సీజన్ బెస్ట్. ఓవరాల్‌గా రెండో అత్యుత్తమ ప్రదర్శన. వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ 2022లో అతను 89.94 మీటర్ల దూరం ఈటెను విసిరాడు. ఇప్పటి వరకు ఇదే అత్యధికం. టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా ఈటెను 87.58 మీటర్ల దూరం విసిరి బంగారు పతకాన్ని సాధించాడు. ఈ సారి అంతకంటే అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి ఫైనల్ చేరాడు. ఫైనల్లోనూ ఇదే ప్రదర్శనను పునరావృతం చేస్తే నీరజ్ చోప్రా మరోసారి బంగారు పతకం సాధిస్తాడు. అయితే అతనికి పాకిస్థాన్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ నుంచి తీవ్ర పోటీ నెలకొంది. టోక్యో ఒలింపిక్స్‌లో అతను రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ గెలిచాడు. తాజా క్వాలిఫికేషన్స్‌లో అర్షద్ నదీమ్ 86.59 మీటర్ల విసిరి ఫైనల్‌కు అర్హత సాధించాడు. రెండు గ్రూప్స్ క్వాలిఫికేషన్ అనంతరం నీరజ్ చోప్రా అగ్రస్థానంలో నిలవగా, 88.63 మీటర్లతో గ్రెనడియన్ జావెలిన్ త్రోయర్ రెండో స్థానంలో నిలిచాడు. 87.76 మీటర్లతో జర్మనీ ప్లేయర్ వెబెర్ మూడో స్థానంలో నిలవగా, నదీమ్ అర్షద్ నాలుగో స్థానంలో నిలిచాడు. రెండు గ్రూప్స్‌లో కలిపి టాప్-6లో నిలిచిన అథ్లెట్లు ఫైనల్‌కు అర్హత సాధించాడు.

Post a Comment

0 Comments

Close Menu