Ad Code

బంగ్లాదేశ్‌పై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నా మద్దతు : మమతా బెనర్జీ


బంగ్లాదేశ్‌లో హింసాకాండ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నా మద్దతుగా నిలుస్తామని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. రాష్ట్ర ప్రజలు వదంతులను నమ్మొద్దని, శాంతిభద్రతల పరిరక్షణకు చేయూత అందించాలని కోరారు. ''ఇది రెండు దేశాలకు సంబంధించిన వ్యవహారం. అందుకే కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నా మనం అండగా నిలవాలి'' అని మమతా బెనర్జీ అన్నారు. ''బంగ్లాదేశ్ పరిణామాలపై రాజకీయ పార్టీలు కూడా అనవసర వ్యాఖ్యలు చేయకూడదు. ఇప్పటికే కొందరు బీజేపీ నేతలు కామెంట్స్ చేశారు. వాళ్లు అలా మాట్లాడకుండా ఉండాల్సింది'' అని మమతా బెనర్జీ అభిప్రాయపడ్డారు. బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభంపై ప్రధాని మోడీ త్వరలోనే స్పందిస్తారని బీజేపీ నేత లాకేత్ ఛటర్జీ చేసిన వ్యాఖ్యను ఆమె గుర్తుచేశారు. ''బంగ్లాదేశ్ అల్లర్లలో ఎంతో మంది చనిపోయారు. నిరసనలు ఎంతకూ ఆగకపోవడంతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్‌కు వచ్చారు. ప్రధాని మోడీ నాయకత్వంలో భారత్ సురక్షితంగా ఉందని భావించడం వల్లే హసీనా మన దేశానికి వచ్చారు. అవసరమైతే తప్పకుండా బంగ్లాదేశ్ వ్యవహారంపై భారత ప్రధాని స్పందిస్తారు'' అని దీదీ పేర్కొన్నారు.

Post a Comment

0 Comments

Close Menu