Ad Code

జావెలిన్ త్రోయర్ లో అర్షద్ నదీమ్ కు గోల్డ్, నీరజ్‌ చోప్రా కు సిల్వర్‌ !


పారిస్‌ ఒలింపిక్స్‌ 2024 పురుషుల జావెలిన్ త్రోయర్ ఫైనల్స్‌లో పాకిస్తాన్ అథ్లెట్ హర్షద్ నదీమ్ స్వర్ణం సాధించాడు. అర్షద్ ఈటెను 92.97 మీటర్లు విసిరాడు. భారత స్టార్ జావెలిన్‌ త్రో ప్లేయర్ నీరజ్‌ చోప్రా ఈటెను 89.45 మీటర్లు విసిరి సిల్వర్‌ మెడల్‌ను సాధించాడు. నీరజ్‌ సిల్వర్‌ మెడల్‌ సాధించడంతో హర్యానాలోని తన ఇంటి దగ్గర సంబరాలు మిన్నంటాయి. నీరజ్‌ కుటుంబ సభ్యులు స్వీట్లు పంచుకుని పండగ చేసుకున్నారు. నీరజ్‌ తల్లి సరోజ్‌ దేవి ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ అందరి మనసులు గెలుచుకున్నారు. బంగారు పతకం సాధించిన పాకిస్తాన్ క్రీడాకారుడు అర్షద్ నదీమ్ కూడా తన కుమారుడి లాంటివాడే అని నీరజ్‌ చోప్రా తల్లి సరోజ్‌ దేవి పేర్కొన్నారు. 'నా కుమారుడు నీరజ్‌ చోప్రా రజత పతకం సాధించడం చాలా ఆనందంగా ఉంది. గోల్డ్‌ మెడల్‌ కంటే కూడా ఎంతో విలువైంది. బంగారు పతకం సాధించిన అర్షద్ నదీమ్ కూడా నా బిడ్డ లాంటివాడే. నీరజ్‌ ప్రదర్శనపట్ల గర్వంగా ఉంది. ఇంటికి వచ్చాక అతడికి ఇష్టమైన ఆహారాన్ని వండిపెడతా' అని సరోజ్‌ దేవి చెప్పుకొచ్చారు. నీరజ్‌ చోప్రా తండ్రి సతీశ్ మాట్లాడుతూ 'నీరజ్‌ దేశం కోసం సిల్వర్‌ మెడల్ గెలిచాడు. మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం. ఎంతో గర్వంగా భావిస్తున్నాం. నీరజ్‌ యువతకు స్ఫూర్తిగా నిలిచాడు. గాయం తీవ్రత కూడా అతడి ప్రదర్శనపై కాస్త ప్రభావం చూపించి ఉండొచ్చు. గాయం లేకపోతే మెరుగైన ప్రదర్శన చేసేవాడు' అని చెప్పారు. కామన్‌వెల్త్‌ గేమ్స్‌కు ముందు గాయం కారణంగా నీరజ్‌ దూరమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తీవ్రంగా శ్రమించి ఒలింపిక్స్‌లో బరిలోకి దిగాడు.

Post a Comment

0 Comments

Close Menu