Ad Code

ఆరు నెలల్లో ₹6.61 లక్షల కోట్లు సమీకరించనున్న కేంద్రం !


ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి ఆరు నెలల్లో రూ.6.61 లక్షల కోట్ల రుణాన్ని కేంద్రం సమీకరించనుంది. ఆర్థిక వృద్ధికి ఊతం ఇచ్చేందుకు కావాల్సిన రెవెన్యూ లోటు భర్తీకి గానూ సెక్యూరిటీల వేలం ద్వారా ఈ మొత్తాన్ని సేకరించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందుకోసం అక్టోబర్‌-మార్చి మధ్య సెక్యూరిటీల వేలం నిర్వహించనుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.14.01 లక్షల కోట్లు మార్కెట్‌ నుంచి సమీకరించాలని బడ్జెట్‌లో కేంద్రం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో రూ.6.61 లక్షల కోట్ల రుణాలను (47.2 శాతం) రెండో అర్ధభాగంలో సేకరించాలని కేంద్రం నిర్ణయించింది. రూ.20 వేల కోట్ల సావరిన్‌ గ్రీన్‌ బాండ్లు సహా నిర్దేశిత గడువుతో కూడిన సెక్యూరిటీల వేలం ద్వారా ఈ మొత్తాన్ని సమీకరించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. 21 వారాల్లో వేలం ద్వారా ఈ నగదు సమీకరింనున్నారు. సెక్యూరిటీలు అనేవి 3, 5, 7, 10, 15, 30, 40, 50 ఏళ్ల కాలవధి కలిగి ఉంటాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 14.01 లక్షల కోట్లు రుణ సేకరణ లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే 7.4 లక్షల కోట్లు (52.8 శాతం) ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగం ప్రభుత్వం సేకరించింది. గత ఆర్థిక సంవత్సరం 15.43 లక్షల కోట్ల రుణ లక్ష్యంతో పోలిస్తే ఈ మొత్తం తక్కువే కావడం గమనార్హం. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌లో తొలుత రూ.14.13 లక్షల కోట్లుగా రుణాన్ని అంచనా వేశారు. ఎన్నికల అనంతరం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రెవెన్యూ మెరగవుతుందన్న అంచనాలతో ఆ మొత్తాన్ని రూ.12వేల కోట్ల మేర కుదించారు.

Post a Comment

0 Comments

Close Menu