Ad Code

బుకింగ్ రద్దు చేసిందనే కోపంతో కళాశాల విద్యార్థిని చెంప మీద కొట్టిన ఓలా డ్రైవర్‌ !


బెంగళూరులో ఓ యువతి పట్ల ఆటోవాలా ప్రవర్తించిన తీరు నెట్టింట వైరల్‌గా మారింది. బుకింగ్ రద్దు చేసిందనే కోపంతో ముత్తురాజ్ అనే ఓలా ఆటో డ్రైవర్ ఓ కళాశాల విద్యార్థిని చెంప మీద కొట్టాడు. ఈ వ్యవహారాన్ని సదరు బాధితురాలు వీడియోతీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అతడు ఊచలు లెక్కపెడుతున్నాడు. యువతిని కొట్టి బెదిరించినందుకు మగడి రోడ్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. IPC సెక్షన్ 74, 352 కింద కేసు నమోదు చేశారు. 'నిందితుడు పట్టపగలు యువతిని మాటలతో దుర్భాషలాడాడు మరియు శారీరకంగా దాడి చేశాడు. ఆమె బుక్‌ చేసిన రైడ్‌ను క్యాన్సిల్ చేయడమే ఇందుకు కారణం. అలాంటి ప్రవర్తన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఆటోవాలాపై కేసు నమోదు చేసి కోర్టు ముందు హాజరుపరచాలని నిర్ణయించాము. అతడిని జ్యుడీషియల్ కస్టడీకి బదిలీ చేస్తూ న్యాయస్థానం కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది' అని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. రైడ్ క్యాన్సిల్ చేసిన దాని కంటే ఒక్క చెంప దెబ్బ కొట్టినందుకు ఆటోవాలా భారీ మూల్యం చెల్లించుకుంటున్నాడు. బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి కనీసం 4 రోజుల కస్టడీని ఎదుర్కొంటున్నాడు. న్యాయవాదిని నియమించుకోవడం సహా ఇతర లీగల్ ఖర్చులకు 30 వేలు కంటే ఎక్కువ వెచ్చించాల్సి ఉంటుందని అంచనా. రైడ్ రద్దు చేయబడినప్పుడు తనకు కోపం వచ్చిందని, అయితే దుర్భాషలాడడం మరియు యువతిపై శారీరకంగా దాడి చేయడం తప్పేనని ముత్తురాజ్ పోలీసుల ఎదుట అంగీకరించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో పలువురు మహిళలు తమకు జరిగిన ఇదే తరహా సంఘటనలను ఒక్కొక్కరుగా సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఇవన్నీ కలిసి రైడ్ హెయిలింగ్ సంస్థల లోపభూయిష్ట సేవలతో పాటు సురక్షిత ప్రయాణాల పట్ల ఆందోళనకు కారణమయ్యాయి. ఓలా, ర్యాపిడో వంటి కంపెనీలు తమ క్యాన్సిలేషన్ నిబంధనలను మరోసారి రివ్యూ చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu