Ad Code

అధికారాన్ని సాధించాలంటే కూటమి బలంగా, ఐకమత్యంగా ఉండాలి !


రానున్న పది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూటమి సీట్ల పంపకాన్ని పూర్తిచేస్తుందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధినేత శరద్ పవార్ అన్నారు. బారామతిలో ఆయన పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారాన్ని సాధించాలంటే ప్రతిపక్ష కూటమి బలంగా, ఐకమత్యంగా ఉండాలన్నారు. ఎన్సీపీకి చెందిన కొందరు మాజీ ఎమ్మెల్యేలపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. వారు రానున్న ఎన్నికల్లో గెలవరని స్పష్టం చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలున్నాయి. అధికారాన్ని సాధించాలంటే 145 సీట్లు సాధించాల్సి ఉంటుంది. అభ్యర్థులను ఎంపిక చేయడంలో వారికున్న గెలుపు అవకాశాలను మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటామని, వేరే ఏ ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోబోమని తేల్చిచెప్పారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఉద్దవ్ థాక్రే శివసేన కలిసి మహావికాస్ అఘాడీగా ఏర్పడ్డాయి. కూటమి అధికారంలోకి రావాలంటే ప్రతి పార్టీకి చెందిన కార్యకర్త నిబద్ధతగా పనిచేయాలని, తమ పార్టీ పోటీలో లేనిచోట ఇతర పార్టీలకు మద్దతివ్వాలన్నారు. స్థానికంగా ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయనే విషయం తెలుసుకునేందుకు ప్రతి తాలూకాలో సర్వేలు నిర్వహిస్తున్నట్లు శరద్ పవార్ వెల్లడించారు. అభ్యర్థులు ఎవరైతే గెలవగలుగుతారు అనే అంశంపై ఆయన కార్యకర్తల అభిప్రాయాన్ని సేకరించారు. మొన్న జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ప్రదర్శించిన పనితీరునే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రదర్శించాలని కార్యకర్తలకు శరద్ పవార్ సూచించారు.

Post a Comment

0 Comments

Close Menu