Ad Code

తెలంగాణలో వ్యవసాయ మోటార్లకు సోలార్ పంపు సెట్లు !


ప్రజల దీవెనలతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం వచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రజల లక్ష్యాలను రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలుగా మార్చుకున్నామని చెప్పారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో మంత్రి శ్రీధర్బాబుతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..'' ప్రజా ఆకాంక్షలను చట్టాలుగా మార్చాం. 15 రోజుల్లో రైతుల ఖాతాల్లో రూ.18 వేల కోట్లు వేశాం. దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రుణమాఫీ చేశాం. అర్హత ఉన్న ప్రతి రైతుకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం. రుణమాఫీ అంశంలో వెనకడుగు వేయం. పంటల బీమా ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నాం. ప్రయోగాత్మకంగా రాష్ట్రవ్యాప్తంగా 30 నుంచి 40 గ్రామాల్లో వ్యవసాయ మోటార్లకు సోలార్ పంపుసెట్లు పెట్టబోతున్నాం. సోలార్ తో రైతులకు ఉచితంగా విద్యుత్ పొందడమే కాకుండా ఆదాయం సమకూర్చుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ ఖర్చుతో ఇండ్లకు సౌర విద్యుత్ సౌకర్యం కల్పిస్తాం. ఇటీవల సీఎం రేవంత్రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు విదేశాలకు వెళ్లి పరిశ్రమల ఏర్పాటు కోసం రూ.36 వేల కోట్ల ఎంవోయూలు చేసుకున్నారు'' అని తెలిపారు. అర్హులైన రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని మంత్రి శ్రీధర్ బాబు స్సష్టంచేశారు. సాంకేతిక సమస్యల కారణంగా కొందరికి రుణమాఫీ కాలేదని మంత్రి తెలిపారు. రూ. లక్ష రుణమాఫీ చేసేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదేండ్లు సమయం తీసుకుందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒకే దఫాలో రూ.2 లక్షల రుణమాఫీ చేసినట్టు గుర్తు చేశారు. గురువారం ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఘర్షణ పడిన విషయాన్ని గుర్తు చేస్తూ.. దానిని కాంగ్రెస్కు అంటగడుతున్నారని శ్రీధర్ బాబు మండిపడ్డారు.

Post a Comment

0 Comments

Close Menu