Ad Code

అమెరికా బి-2 బాంబర్లతో యెమెన్‌పై దాడి !


యెమెన్‌లో హూతీ రెబల్స్‌పై అమెరికా బి-2 స్టెల్త్‌ బాంబర్లను రంగంలోకి దించింది. గురువారం తెల్లవారుజామున యెమెన్‌పై దాడులు చేసింది. ఈ విషయాన్ని రక్షణ మంత్రి లాయిండ్‌ ఆస్టిన్‌ స్వయంగా వెల్లడించారు. మొత్తం ఐదు అండర్‌గ్రౌండ్‌ ఆయుధ డిపోలను బి-2 స్టెల్త్‌ బాంబర్లు ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. ఎర్ర సముద్రంలో పౌర నౌకలను లక్ష్యంగా చేసుకోవడానికి హూతీలు వినియోగించే ఆయుధాలను భద్రపర్చే డిపోలని ముగ్గురు అమెరికా అధికారులు సీఎన్‌ఎన్‌కు వెల్లడించారు. ''మా నుంచి తప్పించేందుకు వీలుగా శత్రువులు తమ ఆయుధాలను ఎంత లోతుగా దాచినా వదిలిపెట్టమన్న విషయం ఈ దాడితో నిరూపితమైంది. ఇక మా వాయుసేన బీ-2 స్టెల్త్‌ బాంబర్‌ వినియోగంతో.. అవసరమైనప్పుడు ప్రపంచవ్యాప్తంగా దాడి చేయడంలో మాకున్న సామర్థ్యం ఏమిటో చెప్పినట్లైంది. హూతీల సామర్థ్యాన్ని కుప్పకూల్చాలని అధ్యక్షుడు జోబైడెన్‌ జారీ చేసిన ప్రత్యేక ఆదేశాల మేరకే ఈ దాడిని చేపట్టాం. వారు భవిష్యత్తులో చేసే దాడులకు తీవ్ర పరిణామాలుంటాయని మేము హెచ్చరిస్తున్నాం'' అని లాయిడ్‌ ఆస్టిన్‌ వ్యాఖ్యానించారు. హూతీలపై అమెరికా తొలిసారి బి-2 వాడినట్లైంది. సాధారణ ఫైటర్‌ జెట్లతో పోలిస్తే ఈ యుద్ధవిమానం అత్యంత శక్తిమంతమైంది. సుదూర లక్ష్యాలను కూడా అవలీలగా ఛేదిస్తుంది. అంతేకాదు.. అత్యంత భారీ బాంబులను ఇది మోసుకెళ్లగలదు. ఇప్పటివరకు అమెరికా కేవలం సాధారణ ఫైటర్‌ విమానాలనే హూతీలపై వాడింది.

Post a Comment

0 Comments

Close Menu