Ad Code

ఇజ్రాయెల్ దాడుల్లో మేయర్ సహా 20 మంది మృతి


లెబనాన్‌లో హెజ్‌బొల్లా మిలిటెంట్ల స్థావరాలు, ముఖ్య నేతలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులను కొనసాగిస్తోంది. వైమానిక దాడులపై అమెరికా అభ్యంతరం తెలిపినప్పటికీ ఇజ్రాయెల్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఆరు రోజుల తర్వాత బీరూట్ లోని దక్షిణ ప్రాంతంతోపాటు ఇతర ప్రదేశాల్లో బుధవారం భారీ ఎత్తున వైమానిక దాడులు జరిపింది. బీరూట్‌లో నివాస భవనం కింద ఉన్న హెజ్బొల్లా ఆయుధ గోదాంపై దాడి చేసినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఇజ్రాయెల్‌ మిలిటరీ ఎక్స్‌లో హెచ్చరిక పోస్టు చేసిన గంట తర్వాత మొదటి దాడి జరిగింది. అనంతరం మరో రెండు దాడులు జరిపింది. కాగా, నబతిహ్‌ మున్సిపాలిటీ భవనంపై జరిగిన దాడిలో మేయర్‌ సహా 20 మంది మృతి చెందారు. సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనే అంశంపై సమావేశం జరుగుతుండగా ఐడీఎఫ్ దాడి చేసినట్లు ప్రత్యక్షసాక్షులు చెప్పారు. భవనాల శిథిలాల నుంచి మృతదేహాలను వెలికితీసినట్లు తెలిపారు. కాగా, బీరుట్‌పై దాడులు తగ్గుతాయని అమెరికా హామీ ఇచ్చిన తర్వాత కూడా ఇజ్రాయెల్‌ దాడులు ఆపడటం లేదని లెబనాన్‌ తాత్కాలిక ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. నబతిహ్‌ నగరంతోపాటు పరిసర ప్రాంతాల్లో 30 నిమిషాల వ్యవధిలో 11 దాడులు జరిగినట్లు గవర్నర్‌ వెల్లడించారు. ఇక, మంగళవారం లెబనాన్ దక్షిణ ప్రాంతంలోని కానా పట్టణంలో జరిగిన దాడుల్లో మృతుల సంఖ్య 15కు పెరిగింది. మరోవైపు, తమ భూభాగంపై 90 రాకెట్లతో హెబ్బొల్లా దాడులు చేసినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది.

Post a Comment

0 Comments

Close Menu