Ad Code

తెలంగాణలో 9,10 తరగతి సైన్స్ పరీక్షల్లో మార్పులు !


తెలంగాణ విద్యా శాఖ తొమ్మది, పదో తరగతి సైన్స్ పరీక్షా విధానంలో మార్పులు చేసింది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి. ఇప్పటి వరకు ఉన్న పరీక్ష నిర్వహణలో సవరణలు తీసుకురావాలని నిర్ణయించారు. ఇక నుంచి సైన్స్‌లోని భౌతిక, జీవశాస్త్రాల పరీక్షలు వేర్వేరుగా రెండు రోజులు జరగనున్నాయి. ప్రస్తుతం రెండు సబ్జెక్టులకు కలిపి వేర్వేరుగానే పశ్నాపత్రాలను ఇస్తున్నారు. రెండు పేపర్లకు ఒకే రోజు పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి భౌతికశాస్త్రం పరీక్ష ఒక రోజు, జీవశాస్త్రం పరీక్ష మరుసటి రోజు నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల్లో సంస్కరణల నేపథ్యంలో 2022 డిసెంబరులో పరీక్ష ప్రశ్నపత్రంలో ఛాయిస్‌ను మార్పు చేసారు.ఇది 2022-23, 2023-24 విద్యా సంవత్సరాలకు మాత్రమే వర్తిస్తుందని నాటి జీవోలో పేర్కొన్నారు. దీంతో, ఈ విద్యా సంవత్సరం ప్రశ్నపత్రాల స్వరూపంపై విద్యార్ధులు, ఉపాధ్యాయుల్లో అయోమయం నెలకొంది. దీనిపై విద్యాశాఖ ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదని గత కొద్ది రోజులుగా చర్చసాగుతోంది. ఈ నేపథ్యంలో గత జీవోకు సవరణ చేస్తూ తాజాగా జీవో 23ను విద్యాశాఖ విడుదల చేసింది. 2024 మర్చి పదో తరగతి పరీక్షల వరకు భౌతికశాస్త్రం, జీవశాస్త్రం పరీక్షలు ఒకదాని తర్వాత మరొకటిగా ఒకే రోజు జరుపుతూ వచ్చారు. ఒకో పరీక్షకు గంటర్నర సమయం కేటాయించేవారు. ఒక పరీక్ష రాసిన తర్వాత జవాబు పత్రాలను తీసుకోవడం, అనంతరం మరో పరీక్ష ప్రశ్నపత్రం ఇవ్వడానికి అదనంగా 20 నిమిషాలు సమయం ఇస్తున్నారు. తాజా నిర్ణయం మేరకు వేర్వేరు రోజుల్లో పరీక్షలు జరపాలని నిర్ణయించడంతో ఒక్కో పరీక్షకు గంటన్నర సమయం మాత్రమే ఇవ్వనున్నారు. మిగిలిన సబ్జెక్టులన్నింటికీ ఒకటే పేపర్‌ ఉండటంతో ఒక్కో సబ్జెక్ట్‌ పరీక్షకు 3 గంటల సమయం కేటాయిస్తారు. ఇక ఛాయిస్‌ కూడా గతంలో మాదిరిగానే ఉంటుందని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. సైన్స్‌ సబ్జెక్టులో మారిన విధానం తొమ్మిదో తరగతి పరీక్షలకు కూడా వర్తిస్తుందని అధికారులు చెబుతున్నారు.

Post a Comment

0 Comments

Close Menu