Ad Code

పోక్సో కేసులో నిందితుడు రైలు పట్టాలపై ఆత్మహత్య !


ఆంధ్రప్రదేశ్ లోని మన్యం జిల్లా పార్వతీపురం మండలం గోపాలపురం గ్రామానికి చెందిన కర్రి రాకేష్‌ (18) ఇటీవల గ్రామంలోని ఒక బాలికపై అత్యాచారం చేశాడు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి యువకుడిని విచారణ నిమిత్తం పార్వతీపురం రూరల్‌ ఎస్‌ఐ దినకర్‌ మంగళవారం రాత్రి స్టేషనుకు తీసుకొచ్చారు. స్టేషనుకు తీసుకువచ్చిన కొద్ది క్షణాల్లోనే నాటకీయంగా నిందితుడు మంగళవారం రాత్రి పోలీస్‌స్టేషన్‌ నుంచి తప్పించుకుని, ఆత్మహత్య చేసుకున్నాడు. స్టేషన్‌కు కూతవేటు దూరంలో రైలు పట్టాలపై బుధవారం ఉదయం శవంగా కనిపించాడు. ఈ సంఘటన పార్వతీపురం పట్టణంలో కలకలం సృష్టించింది. పరారైన విషయాన్ని ఎస్‌ఐ వారి కుటుంబీకులకు తెలియజేశారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం ఉదయం బెలగాం రైల్వేస్టేషన్‌ శివారులో పట్టాలపై ఉన్న శవాన్ని రైల్వే పోలీసులు గుర్తించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రాకేష్‌గా గుర్తించారు. కుమారుడి మరణ వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిని బయటకు ఎలా వదులుతారని రాకేష్‌ తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. యువకుడి మృతికి పోలీసులే బాధ్యత వహించాలని గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు. గోపాలపురం గ్రామానికి చెందిన కర్రి అప్పడు, గౌరీ దంపతుల రెండో కుమారుడు రాకేష్‌. రాకేష్‌ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. పెద్ద కుమారుడు రామకృష్ణ డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు. ఈ సంఘటనపై డివిజనల్‌ పోలీస్‌ అధికారి అంకిత సురాన, సిఐ గోవిందరావు సమగ్ర దర్యాప్తు నిర్వహించి, నివేదిక ఉన్నతాధికారులకు పంపనున్నట్లు తెలిపారు.సమగ్ర దర్యాప్తు చేయాలిసిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు పోలీస్‌ స్టేషన్‌కి దర్యాప్తు కోసం తీసుకెళ్లిన యువకుడు బలవన్మరణానికి పాల్పడటం విచారకరమని, దీనికి పోలీసులే బాధ్యత వహించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు డిమాండ్‌ చేశారు. పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న యువకుడు స్టేషన్‌ నుంచి ఎలా తప్పించుకోగలిగాడని ప్రశ్నించారు. ఆత్మహత్యకు ప్రేరేపించిన సంఘటన నేపథ్యంపై విచారణ చేపట్టాలని కోరారు. యువకుడి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

Post a Comment

0 Comments

Close Menu