Ad Code

మేం ఎంతోకాలంగా చెబుతున్నదే ఈ రోజు రుజువైంది : రణ్‌ధీర్‌ జైశ్వాల్‌ !


భారత్‌తో దౌత్య విభేదాలు మళ్లీ భగ్గుమన్న వేళ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఖలిస్థానీ అనుకూలవాది నిజ్జర్‌  హత్య కేసులో భారత ప్రభుత్వ ఏజెంట్ల పాత్ర ఉందని ఆరోపణలు చేసినప్పుడు తన వద్ద నిఘా సమాచారమే తప్పా పక్కా ఆధారాలేవీ లేవని ట్రూడో అన్నారు. దీనిపై తాజాగా భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ ఒట్టావాకు గట్టి కౌంటర్‌ ఇచ్చింది. కెనడా ప్రధాని తీరుపై తీవ్రంగా మండిపడింది. ''ఈ విషయంలో (నిజ్జర్‌ హత్య కేసుకు సంబంధించి) మేం ఎంతోకాలంగా చెబుతున్నదే ఈ రోజు రుజువైంది. మన దౌత్యవేత్తలపై చేస్తున్న తీవ్రమైన ఆరోపణలకు మద్దతిచ్చేలా కెనడా మనకు ఎలాంటి ఆధారాలను ఇవ్వలేదు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సంబంధాలు ఇంత తీవ్రస్థాయిలో దిగజారడానికి కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడోనే పూర్తి బాధ్యుడు'' అని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైశ్వాల్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు. నిజ్జర్‌ను గత ఏడాది హతమార్చడంలో భారత ప్రభుత్వ ఏజెంట్ల పాత్ర ఉందని ఆరోపణలు చేసినప్పుడు తన వద్ద నిఘా సమాచారమే తప్పిస్తే పక్కా ఆధారాలేవీ లేవని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో బుధవారం అంగీకరించారు. కెనడా ఎన్నికల ప్రక్రియ, ప్రజాస్వామ్య వ్యవస్థల్లో విదేశాల జోక్యంపై విచారణ నిర్వహిస్తున్న కమిటీ ముందు ఆయన ఈ విషయాన్ని ధృవపర్చారు. అయితే, ఈ సందర్భంగా భారత్‌పై మరోసారి అభ్యంతరకర ఆరోపణలు చేశారు. భారత ప్రధాని మోదీ నేతృత్వంలోని సర్కారుతో విభేదించే కెనడావారి వివరాలను ఇక్కడి భారత దౌత్యవేత్తలు సేకరించి, ఉన్నతస్థాయిలోని వారికి లారెన్స్‌ బిష్ణోయ్‌ వంటి నేరగాళ్ల ముఠాలకు చేరవేస్తున్నారని ఆరోపించారు.

Post a Comment

0 Comments

Close Menu