Ad Code

మా పిల్లలను చంపి, మాకే ఆహారంగా పెట్టారు !


రాక్​లోని మతపరమైన మైనారిటీ యాజిదీ తెగ పిల్లలను చంపి, ఆ చిన్నారుల మాంసాన్ని తమ చెరలో ఉన్న అదే తెగ మహిళలకు తినిపించారు. ఈ విషయాన్ని పదేండ్ల తర్వాత వారి చెర నుంచి బయటపడిన యాజిదీ యువతి ఫౌజియా అమీన్ సిడో వెల్లడించింది. ఐసిస్ చెరలో బందీగా ఉన్న ఫౌజియాను ఇజ్రాయెల్​సైన్యం లెబనాన్​లో ఈ నెల ప్రారంభంలో రక్షించింది. యునైటెడ్ నేషన్స్ (యూఎన్) తో కలిసి చేపట్టిన ఆపరేషన్​లో ఆమెను గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కోలుకున్న తర్వాత ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఐసిస్  చెరలో దశాబ్దకాలం తాను అనుభవించిన దారుణాలను వివరించింది. యాజిదీ శిశువుల తలలు నరికి వారి మాంసాన్ని తమకు తినిపించారని తెలిపింది. 2014లో తొమ్మిదేండ్ల వయస్సులో తాను, ఇద్దరు సోదరులు ఐసిస్​ టెర్రరిస్టులకు బందీలుగా చిక్కినట్టు తెలిపింది. ఆ సమయంలో తమతో పాటు 200 మంది మహిళలు, పిల్లల్ని అపహరించారని చెప్పింది. తమను బంధించిన తరువాత మూడు రోజులు తినడానికి ఏమీ ఇవ్వలేదని, ఆ తర్వాత అన్నం, మాంసం పెట్టారని ఫౌజియా వెల్లడించింది. ''వాళ్లు పెట్టిన అన్నం, మాంసం తింటున్నప్పుడు ఏదో తేడాగా అనిపించింది. తిన్నాక కొద్ది సేపటికి చాలా మంది వాంతులు చేసుకున్నారు. ఆ తర్వాత మాకు అసలు విషయం చెప్పారు. మీ శిశువులనే చంపి మీకు వండి పెట్టామన్నారు. పిల్లలను చంపి, వండుతున్నప్పుడు తీసిన ఫోటోలను మాకు చూపించారు. ఆ టైమ్​లో ఓ మహిళ కనిపించకుండా పోయిన తన బిడ్డను గుర్తు చేసుకుని అక్కడికక్కడే గుండెపోటుతో చనిపోయింది' అని ఆవేదన వ్యక్తం చేసింది. తమను తొమ్మిది నెలలు అండర్ గ్రౌండ్ జైల్లో ఉంచారని, అక్కడ కలుషిత, అపరిశుభ్రమైన నీళ్లు తాగి ఎంతో మంది పిల్లలు చనిపోయాని తెలిపింది. ఆ తర్వాత తన పేరును 'సబయా'గా మార్చి లైంగిక బానిసగా పలుమార్లు జిహాదీ టెర్రరిస్టులకు అమ్మారని పేర్కొంది. తనకు జన్మించిన ఇద్దరు పిల్లలు ఐసిస్ బందీలుగా ఉన్నారని వివరించింది.

Post a Comment

0 Comments

Close Menu