Ad Code

పోలీసు విచారణలో భారత హైకమిషనర్‌ పాల్గొనాలని కెనడా కోరింది, అందుకే వెనక్కి రప్పించాం : జైశంకర్‌


భారత దౌత్యవేత్తలపై కెనడా ప్రభుత్వ చర్యలతో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించిన విషయం తెలిసిందే. తాజా పరిణామాలపై భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ స్పందించారు. పోలీసు విచారణలో భారత హైకమిషనర్‌ పాల్గొనాలని కెనడా కోరిందని, అందుకే మన హైకమిషనర్‌తోపాటు దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించామని చెప్పారు. ఓ జాతీయ వార్తా ఛానెల్‌ నిర్వహించిన సదస్సులో పాల్గొన్న ఆయన ఆ దేశంతో సంబంధాలను ప్రస్తుతం అంచనా వేయడం కష్టమేనన్నారు. పోలీసు విచారణలో భారత హైకమిషనర్‌ పాల్గొనాలని కెనడా కోరింది. అందుకే మన హైకమిషనర్‌తోపాటు దౌత్యవేత్తలను ఉపసంహరించుకోవడాన్ని ఎంచుకున్నాం. దౌత్యవేత్తల సంక్షేమం, భద్రతకు సంబంధించి కెనడాలో ఏం జరుగుతుందనే విషయాలను తెలుసుకోవడం కెనడాకు ఇబ్బందికరంగా మారినట్లు కనిపిస్తోంది. అదే భారత్‌లో.. కెనడా దౌత్యవేత్తలు మాత్రం మన సైన్యం, పోలీసుల సమాచారాన్ని స్వేచ్ఛగా సేకరించడం, నిర్దేశిత పౌరులను కెనడాలో అడ్డుకునేందుకు మాత్రం ఎటువంటి చర్యలుండవు అని కెనడా తీరుపై జైశంకర్‌ మండిపడ్డారు. ''అక్కడా, ఇక్కడా వారి తీరు భిన్నంగా ఉంది. భారత్‌కు చెందిన నేతలు, దౌత్యవేత్తలను మీ పౌరులు బహిరంగంగా బెదిరిస్తున్నారు అని మనం చెబితే.. వాక్‌ స్వాతంత్ర్యం అంటారు. భారత హైకమిషనర్‌ను బెదిరించినా భావ ప్రకటనా స్వేచ్ఛ కింద పరిగణించాలని అంటున్నారు. అదే భారత్‌లోని కెనడా దౌత్యవేత్త సౌత్‌బ్లాక్‌ నుంచి కోపంతో బయటకు వచ్చారని ఓ భారత జర్నలిస్టు పేర్కొంటే మాత్రం.. విదేశీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. వారి దేశంలో ఒక మాదిరిగా వ్యవహరిస్తాం. విదేశాల్లో అవి మీకు వర్తించవు అని అంటున్నారు. ఇదీ మారుతున్న ప్రపంచంలో చోటుచేసుకుంటున్న పరిస్థితులు'' ఆని కెనడాను ఉద్దేశిస్తూ భారత విదేశాంగ మంత్రి చురకలు అంటించారు. 1945 తర్వాత ప్రపంచంపై పాశ్చాత్య దేశాల ప్రభావం ఎక్కువగా ఉండేదన్న జైశంకర్‌.. గడిచిన 20-25 ఏళ్లలో పరిస్థితుల్లో మార్పు వచ్చిందన్నారు. పాశ్చాత్యేతర దేశాల వాటా, భాగస్వామ్యం, ప్రభావం పెరిగిందని.. ఈ నేపథ్యంలో వివాదాలు, ఘర్షణలు, వాదనలు సహజమేనన్నారు. ఈ క్రమంలో కొన్ని దేశాల మధ్య సంబంధాలు అంత సాఫీగా ఉండవని విదేశాంగ మంత్రి అంచనా వేశారు.

Post a Comment

0 Comments

Close Menu