Ad Code

నిషేధాజ్ఞలున్నా ఉజ్జయిని మహాకాళి ఆలయంలోని గర్భగుడిలోకి శ్రీకాంత్ షిండే !


నిషేధాజ్ఞలున్నా ఉజ్జయిని మహాకాళి ఆలయంలోని గర్భగుడిలోకి మహారాష్ట్ర  సీఎం ఏక్‌నాథ్‌ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండేను  అనుమతించడంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. దాంతో అధికారులు విచారణకు ఆదేశించారు. థానె జిల్లాలోని కల్యాణ్ లోక్‌సభ నియోజకవర్గానికి శ్రీకాంత్ షిండే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన గురువారం సాయంత్రం ఈ ఆలయానికి వెళ్లారు. భార్యతో కలిసి గర్భగుడిలోకి వెళ్లి పూజలుచేశారని ఆలయ వర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ అయింది. సుమారు ఏడాది కాలంగా ఆ ఆలయ గర్భగుడిలోకి ప్రవేశంపై నిషేధం ఉండటంతో ఇది కాస్తా విమర్శలకు దారితీసింది. ''సామాన్యులు దైవ దర్శనం కోసం గంటల కొద్ది క్యూలో నిలబడి వేచిచూస్తుంటే, నిషేధం ఉన్నా వీఐపీలను మాత్రం అనుమతిస్తున్నారు. ఈ వ్యవహారం నిబంధనలకు విరుద్ధం'' అని కాంగ్రెస్ స్పందించింది. ఉజ్జయిని జిల్లా కలెక్టర్, ఆలయ కమిటీ ఛైర్మన్ నీరజ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ మేం ఎవరినీ గర్భగుడిలోకి అనుమతించలేదు. దీనిపై వెంటనే చర్యలకు ఆదేశించాను అని వెల్లడించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎన్నికల వేళ ఈ విమర్శలేవీ పనిచేయవని, హర్యానాలో ఇలాగే తప్పుడు ప్రచారం చేస్తే ప్రజలు ఎలాంటి ఫలితాన్ని ఇచ్చారో అంతా చూశామని శ్రీకాంత్ షిండే వ్యాఖ్యానించారు. 

Post a Comment

0 Comments

Close Menu